October 07, 2017

amitabh-bachchan-pv-sandhu

అమితాబ్ బచ్చన్ హోస్టు చేసే కౌన్ బనేగా కరోడ్ పతిలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూకు పాతిక లక్షల రూపాయల బహుమతి వచ్చింది. ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఆమెకు ఒక రాజకీయ పరమైన కొశ్చన్ వేశాడు అమితాబ్. అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి కావడం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిర్వచనాన్ని చెప్పమని కోరుతూ.. దాన్ని పాతిక లక్షల రూపాయల ప్రశ్నగా అడిగారు అమితాబ్. ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని చెప్పి సింధూ పాతిక లక్షల రూపాయల బహుమతిని గెలుచుకుంది.

ఇంతకీ ఆ కొశ్చన్ ఏమిటంటే.. ‘ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. దాని పేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందులో వైఎస్సార్ అనే మూడు అక్షరాలకు నిర్వచనం ఏమిటి?’ అని అమితాబ్ అడిగారు. దీనికి వైఎస్సార్ పూర్తి పేరుతో సహా కొన్ని ఛాయిస్ లను ఇచ్చారు. అందులో ‘యువజన శ్రామిక రైతు’ అనే ఆప్షన్ ను డీగా గా పేర్కొన్నారు.

మొదట ‘ఎడుగూరి సందింటి రాజశేఖర’ అనే ఆప్షన్ ను తీసుకున్న సింధూ ఆ తర్వాత ‘యువజన శ్రామిక రైతు’ ఆప్షన్ ను ఎంచుకుంది. దీంతో పాతిక లక్షల రూపాయలు ఆమె సొంతం అయ్యాయి. ఆ ఛాయిస్ ను ఎంచుకోవడానికి కారణం ఏమిటి అని అమితాబ్ అడుగగా ‘వైఎస్ రైతుల కోసం ఎంతో చేశారు.. అందుకే అదే సమాధానం అయి ఉంటుంది... అనుకున్నాను ’ అని సింధూ సమాధానం ఇచ్చింది. అమితాబ్ కూడా అదే విషయాన్ని చెప్పారు.