November 13, 2017

chandrika-sonika

వడోదర రోడ్ షోలో ప్రధాని మోదీ మొహం మీద గాజులు విసిరి అరెస్టయిన చంద్రికా సోలంకి.. ఇప్పుడెక్కడుంది.. ఏం చేస్తోంది ? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హాట్ సెలబ్రిటీల్లో ఆమె కూడా ఒకటిగా మారిపోయిందా? ఈసారి గుజరాత్ లో మోదీకి 'సినిమా గ్యారంటీ' అంటూ ఛాలెంజ్ విసిరిన.. చంద్రికను బీజీపీ ఊరికే వదిలేస్తుందా? ఇవన్నీ ప్రశ్నలు. ఇప్పటికే దళిత్, పటేల్ సామాజిక వర్గాల్ని దూరం చేసుకున్న గుజరాత్ బీజేపీ, తమ విజయావకాశాల్ని దెబ్బతీసే ఏ ఒక్క ఎలిమెంట్ నూ వదిలిపెట్టకూడదన్న కమిట్ మెంట్ తో వుంది. ఈ క్రమంలోనే చంద్రికా సోలంకి మీద కన్నేసింది విజయ్ రూపానీ సర్కార్.

అంతకుముందు ఉత్తమ టీచర్ గా పురస్కారం అందుకున్న చంద్రికా సోలంకి.. మోది మీద గాజులు విసిరినందుకు సస్పెన్షన్ కి గురై ఏకంగా ఉద్యోగాన్నే పోగొట్టుకుంది. ఇక.. ఊరుకుని లాభం లేదనుకుందో ఏమో.. గుజరాత్ లో ఇక బీజేపీ సర్కార్ వద్దేవద్దు అంటూ ఉద్యమాన్నే లేవదీసింది. చాపకింద నీరులా తన స్కెచ్చులు తాను గీసుకుంటూ.. ఆమె 'అండర్ గ్రౌండ్'లోకెళ్ళినట్లు చెప్పుకున్నారు. రూట్ లెవల్ నుంచి నరుక్కురావాలన్న ఆశయంతో.. రాష్ట్రంలోని 42 వేల మంది ఆరోగ్య కార్యకర్తలనబడే ఆశా వర్కర్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి పూనుకుందట. వీళ్ళతో నిశ్శబ్దంగా మోదీ వ్యతిరేక ప్రచారం చేయించాలన్నది ప్లాన్.

ఇప్పటికే.. పనిగంటలు, కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి డిమాండ్స్ విషయంలో ప్రభుత్వం మీద గుర్రుగా వున్నారు అక్కడి ఆశా వర్కర్స్. వీళ్ళలోని ఆ 'కసి'ని వాడుకుని.. మోదీకి వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తాలని చంద్రిక శ్రమిస్తోంది. 400 మంది మెరికల్లాంటి ఆశా వర్కర్స్ ని ఏరుకుని.. వాళ్లకు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి.. బీజేపీ 'దమనకాండ'ను ఎదుర్కోవాలని, ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టడానికి జనంలో చైతన్యం తీసుకురావాలని తన స్పీచెస్ తో 'వేడి' పుట్టిస్తోందట. ఈ విషయం మీద ఉప్పందుకున్న గుజరాత్ సర్కార్.. వేగంగా స్పందించి.. ఆ 400 మంది ఆశా వర్కర్స్ ని అదుపులోకి తీసుకుంది. చంద్రికా సోలంకి కోసం వెతుకులాట మొదలుపెట్టింది..