February 11, 2018

JC-Diwakar-Reddy-18-2-11

”ఎంపీలు కరివేపాకుల్లాంటివారు.. దేనికీ పనికిరారు..” అంటూ కుండబద్దలు కొట్టినట్లు ఒప్పుకోవడం జేసీ మేనరిజం. అనంతపురం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తాను.. ప్రభుత్వం తరఫున ఏమీ చేయలేకపోతున్నానని, కేంద్రంలో మోదీ ఏది చెబితే అదే జరుగుతుందని మొహమ్మీద కొట్టిచెబుతారాయన. చెప్పడమే కాదు.. తన ఉద్దేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తారు జేసీ దివాకర్ రెడ్డి. నిన్నటివరకూ ఐదురోజులపాటు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ను ఏపీ ఎంపీలంతా ఒక్కటిగా నిలబడి మారుమోగిస్తే.. ఆ వరుసలో అనంత ఎంపీ జేసీ మాత్రం లేరుగాక లేరు. చంద్రబాబు ఒకటికి నాలుగుసార్లు ఆదేశించి ఎంపీలందరినీ పరుగెత్తించినా.. ఆ ఎంపీల పోరాటంలో జేసీ పాలుపంచుకోకపోవడం గమనార్హం.

ఢిల్లీ గుండెలపై గర్జన అంటూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరిపించేలా జరిగిందంటున్న గురువారం నాటి రాష్ట్ర బంద్ లో సైతం జేసీ ఊసే లేదు. ఊరందరిదీ ఒకదారైతే.. జేసీది ఒక దారి.. అంటూ ఇప్పటికే సెటైర్లు పడిపోతున్నాయి. ”అక్కడున్న ఎంపీల్లో జేసీ కంటే మించిన కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు వున్నారు.. వాళ్లందరికీ లేని భేషజం జేసీకెందుకు..? ఒక్క ప్లకార్డు పట్టుకుని కాసేపు ఫోటోలకు ఫోజులిస్తే పోయేదేముంది” అంటూ సొంత పార్టీలోనివారే విమర్శిస్తున్నారు. జేసీ రూటే సెపరేటు.. కాదా మరి.