August 08, 2017

Jayaprakash-Narayan-Pawan-Kalyan-17-8-8

ప్రజాస్వామ్యంలో సమస్యలపై పోరాడేవారిని ఆహ్వానించి ప్రోత్సహించాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. అలాంటి వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణేనని వ్యాఖ్యానించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల వంటి సమస్యలపై పవన్ పోరాడుతున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మీడియాతో మాట్లాడిన జేపీ.. పేదరిక నిర్మూలనకే రిజర్వేషన్లు తెచ్చారని, అంతేగానీ కులానికి కాదని అభిప్రాయపడ్డారు.

ఈ దేశంలో కులాలను కూకటివేళ్ళతో పెకలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీలో కుల కార్చిచ్చు పెరిగింది.. రిజర్వేషన్లను స్వార్థ రాజకీయాలకోసం వినియోగించకుండా ఉంటే సమస్యే ఉండదు అన్నారాయన. పట్టిసీమ అనుసంధానంతో రాయలసీమ రైతులకు మేలు జరిగిందని, పోలవరం ప్రాజెక్టు విషయంలో రైతులకు సకాలంలో పరిహారం అందిందని ఆయన పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని జేపీ ప్రశంసించారు.