KCR-Balakrishna-17-1-6

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు శుక్రవారం నాడు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. చారిత్రక సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం ఓ పాలసీగా పెట్టుకుందని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్‌ను కలిసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. తాను కేసీఆర్‌ను మొదటి షోకు ఆహ్వానించానని చెప్పారు. వినోదపు పన్ను మినహాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు స్వయంగా కేసీఆర్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పారు.

సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ స్వయంగా తెలిపారు. ప్రీమియర్‌ షోకు రావాల్సిందిగా ఆహ్వానించగా.. కేసీఆర్‌ అంగీకరించారని తెలిపారు.

ఈ చిత్రంపై కేసీఆర్‌ ముందు నుంచీ ఆసక్తి కనబరుస్తున్నారు. బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవానికి హాజరై కొబ్బరికాయ కొట్టారు. తెలుగుజాతి గర్వించదగ్గ శాతకర్ణి కథను తెరకెక్కించడం గర్వకారణమంటూ బాలకృష్ణను అభినందించారు. దీంతో పాటు ఈ సినిమాను తొలుత తనకే చూపించాలని కేసీఆర్‌ కోరారు. ఈ నేపథ్యంలోనే సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ.. కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పి, ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించారు. కాగా, అంతకుముందు బాలకృష్ణ కేసీఆర్‌ను కలిసేందుకు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. అయితే కేసీఆర్‌ అసెంబ్లీలో లేరని క్యాంపు కార్యాలయానికి వెళ్లారని చెప్పడంతో ఆయన అక్కడికి వెళ్లారు.