October 07, 2017

KCR-on-Kodandaram

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశం కోదండరామ్ సెంట్రిక్ గా సాగింది. ఇంతకాలం తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ విషయంలో ఆచితూచి స్పందించిన కేసీఆర్, సింగరేణి సక్సెస్ మీట్ సాక్షిగా శివాలెత్తిపోయారు. మీడియా సమావేశం ఆద్యంతం కోదండరామ్ పై విరుచుకుపడ్డారు కేసీఆర్. తన మెదడు.. తన రక్తం కరగబెట్టి తెలంగాణ తెచ్చానన్నారు. అసలు జేఏసీ ఛైర్మన్ అనిపించుకునే హక్కు నీకెక్కడిదని కోదండరామ్ ని ప్రశ్నించిన కేసీఆర్, అసలిప్పుడు జేఏసీ ఎక్కడిదన్నారు. అప్పట్లో జేఏసీలో ఉండి అన్ని రాజకీయ, ఉద్యోగ, సాంఘీక సంఘాలు పోరాడాయని, తెలంగాణ సిద్ధించడంతో జేఏసీ పనిపూర్తయిందని చెప్పారు. తాను తయారు చేసిన వేలాది కార్యకర్తల్లో కోదండరామ్ ఒకరని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అమరుల స్ఫూర్తి యాత్ర అంటున్న కోదండరాం, ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి కోదండరాం రావాలని కేసీఆర్‌ సవాల్ విసిరారు.

పనికిమాలిన నలుగురు పోరగాళ్లని పెట్టుకుని తిరుగుతూ యాత్రలంటున్నారని.. నిజానికి ఆయనిది లంగా రాజకీయ యాత్ర అన్నారు కేసీఆర్. ప్రొ. కోదండ‌రామ్ ఓ పాట‌ను ప్రచారం చేస్తున్నార‌ని, ఆ పాట‌లో ఎవ‌డు ఏలుతున్నాడురా తెలంగాణ‌ని? అని వ‌స్తుంద‌ని.. తెలంగాణ తెచ్చిన వాళ్లు, ప్రజ‌లు ఎన్నుకున్న వారే రాష్ట్రాన్ని ఏలుతున్నార‌ని కోదండ‌రామ్‌కి ఎందుకంత క‌డుపుమంట? అని కేసీఆర్ చుర‌క‌లంటించారు. కోదండరామ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని... కోదండరామ్ మొదటి నుంచీ టీఆర్ఎస్ పార్టీపై విషం కక్కుతూనే ఉన్నారన్నారు. అటు కాంగ్రెస్ పార్టీపైనా కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోదండరామ్ మాటవినే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైందన్నారు. తెలంగాణ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందంటూ ఢిల్లీవెళ్లి సోనియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి కోదండరామ్ అని కేసీఆర్ అన్నారు. కుక్కతోకపట్టుకుని కాంగ్రెస్ పార్టీ గోదారీదిందన్నారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ విజయం సాధించిన వేళ, పూర్తి స్థాయిలో కోదండరామ్ పై విరుచుకుపడ్డారు కేసీఆర్.