Chandrababu-Ijaiaah

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అంటూ ఒకటి ఉంటుంది. ప్రభుత్వంలో అధికారంలో ఎవరు ఉన్నా.. దాన్ని పాటించి తీరాల్సిందే.. ఐతే. ఇలాంటి నియమాలకు కూడా తిలోదకాలు ఇచ్చేవారు ఉన్నారను కోండి అది వేరే విషయం. ఏపీ సీఎం చంద్రబాబు అలాంటి ప్రోటోకాల్ పాటించినా దానికి గౌరవం ఇవ్వకుండా చిక్కుల్లో పడిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది.

ఇటీవల కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఈ ప్రాజెక్టు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉంది. అక్కడ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన ఎక్కలదేవి ఐజయ్య. ఆయన్ను తెలుగుదేశంలోకి లాగేందుకు ఇటీవల ప్రయత్నాలు బాగానే జరిగాయి. కానీ ఐజయ్య వైసీపీ వైపే ఉన్నాడు. ఆ కోపం మనసులో ఉందో ఏమో కానీ.. ఐజయ్యను అందరిముందు అవమానించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ప్రాజెక్టు ప్రారంభోత్సవం అయ్యాక ఓ బహిరంగసభ నిర్వహించారు. అందులో సీఎం, ఇతర నాయకులు మాట్లాడిన తర్వాత అధికారులు ఎమ్మెల్యేతో మాట్లాడించాల్సిన విషయాన్ని సీఎంకు గుర్తు చేశారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్యను మాట్లాడనిస్తే బాగానే ఉండేది. కానీ సీఎం చంద్రబాబు ఏమనుకున్నారో.. ఏయ్.. తమ్ముడు నువ్వు ఎమ్మెల్యేవే కానీ ఇందులో నీకు భాగస్వామ్యం లేదు అన్నారు.

దాంతో వైసీపీ ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ఆయనేదో చెప్పబోతుండగా.. అవును కదా.. నీకు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం లేదుగా.. అంటూ దెప్పిపొడిచారు. ఊరికే థాంక్స్ చెప్పేసి వెళ్లు అంటూ వైసీపీ ఏం మాట్లాడాలో కూడా చంద్రబాబే చెప్పారు. దాంతో ఐజయ్యకు ఎక్కడో కాలినట్టుంది. అంతే సరే సార్ అంటూ మైక్ తీసుకుని ఈ ప్రాజెక్టు సీఎం గారి చేతులమీదుగా పూర్తవడం సంతోషంగా ఉంది అంటూ మొదలుపెట్టాడు.

కానీ.. అసలు ఈ ప్రాజెక్టును ప్రారంభించింది దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా.. అని స్వరం పెంచాడు. ఈ ప్రాజెక్టే కాదు.. పోలవరం ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేసింది మా వైఎస్సే.. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేశామని చెప్పుకుంటున్నారు..అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయారు. కానీ అధికారులు మైక్ కట్ చేశారు. మొత్తానికి ఈ ఐజయ్యతో ఎందుకు కెలుక్కున్నాం రా బాబూ..అని చంద్రబాబు తలపట్టుకున్నట్టయ్యింది.