July 12, 2017

Pawan-Kalyan-17-7-12

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాలను అందించిన కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు త్వరలో పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలని భావిస్తుండటంతో ఇదే పవన్ ఆఖరి సినిమా అన్న ప్రచారం కూడా జరుగుతోంది.

దీంతో పవన్, త్రివిక్రమ్ ల సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకే ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే భారీగా బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానల్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సెట్స్ మీదే ఉన్న సినిమా హక్కులను ఏకంగా 19.5 కోట్లు వెచ్చించి తీసుకున్నారట.

మహేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా అన్ని భాషల శాటిలైట్ హక్కులు కలిపి 25 కోట్లకు అమ్ముడవ్వగా.. పవన్ సినిమా తెలుగు హక్కులు మాత్రమే 20 కోట్ల వరకు ధర పలకటం విశేషం. అలాగే పవన్‌, త్రివిక్రమ్‌ల సినిమాకి నూట ఇరవై కోట్ల బిజినెస్‌ జరిగిందని టాక్‌. దీంతో 'అది పవర్ స్టార్ స్టామినా అంటే..' అని పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.