allu-aravind-pawan-kalyan-17-1-10 (1)

'ఖైదీ నంబర్‌ 150' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ రాకపోవడానికి కారణాలేంటనేది అభిమానులకి అర్థం కాలేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో మూడు సందర్భాల్లో చిరంజీవిని పవన్‌ కలిసాడు. తన నిర్మాణంలో తెరకెక్కిన మొదటి సినిమా సర్దార్‌ ఆడియో వేడుకకి కూడా చిరంజీవినే ముఖ్య అతిథిగా పిలిచాడు. బ్రూస్‌లీ రిలీజ్‌ అయిన సందర్భంలో, చిరంజీవి షష్టిపూర్తికి కూడా పవన్‌ కలిసివచ్చాడు. కనుక అన్నదమ్ముల మధ్య విబేధాలు ఉన్నాయనే వాదన పిచ్చితనమవుతుంది.

అన్నయ్యతో సఖ్యతగానే ఉంటున్నా కానీ చిరంజీవికి సంబంధించిన ఈవెంట్స్‌లో పవన్‌ కనిపించడం లేదు. శ్రీజ పెళ్లికి, ఖైదీ నంబర్‌ 150 ఓపెనింగ్‌కి పవన్‌ వెళ్లలేదు. చివరకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి కుటుంబమంతా ఆహ్వానించినా కానీ జ్వరం వంక చెప్పి హ్యాండిచ్చాడు. అసలు కారణమేంటనేది ఎవరికీ తెలియకపోయినప్పటికీ, అల్లు అరవింద్‌తో పడకపోవడం వల్లే పవన్‌ ఈ ఈవెంట్స్‌కి వెళ్లడం లేదని ఇండస్ట్రీ టాక్‌.

అల్లు అరవింద్‌ ఎక్కడ ఖచ్చితంగా ఉంటాడో అక్కడికి పవన్‌ వెళ్లడం లేదట. వేడుకకి వెళ్లి తీరా అరవింద్‌ ఎదురు పడితే మాట్లాడాలి కనుక, సభామర్యాద పాటించాలి కనుక తనని తాను ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టుకోలేక పవన్‌ తప్పుకుంటున్నాడట. అరవింద్‌తో పవన్‌ విబేధాల వల్లే అల్లు అర్జున్‌ కూడా పవన్‌ విషయంలో అలా రియాక్ట్‌ అవుతున్నాడని అంటున్నారు.

ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి విలీనం వరకు జరిగిన అనేక పరిణామాల్లో అల్లు అరవింద్‌ పాత్ర పవన్‌కి నచ్చలేదని, అంచేతే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని గుసగుసలున్నాయి. ఇవి చాలా కాలంగా వినిపిస్తున్నవే అయినా మళ్లీ ఇంకోసారి తెర మీదకి వచ్చాయి. పవన్‌, చిరంజీవి కలిసి కనిపించేసినట్టే ఏదైనా సందర్భంలో అరవింద్‌తోను పవర్‌స్టార్‌ నవ్వుతూ కనిపిస్తే తప్ప ఈ పుకార్లకి ఫుల్‌స్టాప్‌ పడేట్టు లేదు.