shamanthakamani-movie-review

ఈ చిత్ర దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తన మొదటి సినిమా 'భలే మంచి రోజు' తోనే ఫిల్మ్ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. మరి ఈ సినిమాతో నిజంగానే అద్భుతాలు సృష్టిస్తాడు. ఇది చాలా అద్భుతమైన కథ ఎంతో వినూత్నంగా పూర్తి వినోద భరితంగా ఎంతో ఆహ్లాదంగా తీశాడు. ఈ సినిమాలో పాత్రలే కనిపిస్తాయి కానీ నటులు వారి పనికిమాలిన స్టార్ డమ్ మచ్చుకైనా గోచరించదు.

నాకు తెలిసి కేవలం పాత్రలు వాటి కారక్టరైజేషన్ తప్ప హీరోల హీరోయిజం పూర్తిగా కనిపించని తెలుగు సినిమా ఒక్కటి కూడా గుర్తు లేదు. ఈ సినిమాలో కథనం అలాగే అద్భుతమైన ట్విస్టులతో ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. నిజానికి ఒక హాలీవుడ్ ఎంటర్ టైనర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అన్నిటి కన్నా మించి ఈ సినిమాలోని యువ హీరోలు అసాధారణ ప్రతిభ చూపించారు. ఒక మంచి సినిమాకు కావలసింది రక్తి కట్టే కధ, ఆసక్తికరమైన కధనం, మంచి నటన మరియు హాస్యం ఇవన్నీ సమ పాళ్ళలో పంచడం అనేది న్యూ ఏజ్ సినిమాకు కొత్త డెఫినిషన్ అయితే అది సినిమాలో మెండుగా ఉన్నాయి.

ఈ సినిమాలో కధా కధనం తో పాటు, నటుల ప్రశంస నీయ నటనే కాకుండా చాలా రోజుల తర్వాత సంగీతం సమ కూర్చిన మణి శర్మ కూడా మంచి ఫార్మ్ లో వచ్చాడు. అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే సన్నివేశానుగుణంగా మంచి టెంపో ను పెంచి సినిమాను బాగా రక్తి కట్టిస్తుంది. అలాగే సమీర్ రెడ్డి కెమెరా ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ చూస్తున్న అనుభూతినిస్తుంది.

ఇక కధలోకి వెళితే సుధీర్ బాబు ఒక ధనిక దురాశపరుడైన తండ్రి 'సుమన్' కుమారుడు. అతనికి 7 ఏళ్ళ వయసులోనే కార్ ఆక్సిడెంట్ లో చనిపోతుంది. తల్లి ప్రేమను చిన్నతనంలోనే కోల్పోయిన సుధీర్ ను సవతి తల్లి సురేఖా వాణి సూటి పోటీ మాటలతో అతన్ని అవమానిస్తూ ఇంకా డిప్రెషన్ లో నెట్టి ఒంటరిని చేస్తూ ఉంటుంది.

సుధీర్ తన 25 బర్త్ డే రోజున తన తల్లి జ్ఞాపిక చిహ్నం అయిన 5 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ కార్, శమంతకమణి అని పిలవ బడే ఈ కారులో ఒక పెద్ద 5స్టార్ హోటల్ లో పార్టీ ఇస్తాడు. కానీ తాను ఎంతో ప్రేమగా చూసుకునే తన తల్లి జ్ఞాపికయినా ఈ శమంతకమణి కారు ఈ స్టార్ హోటల్ లో దొంగలించ బడుతుంది. ఈ న్యూస్ తెలుగు మీడియా లో పెద్ద సంచలనం అవుతుంది. ఈ కేసు ను సాల్వ్ చేయను పోలీస్ ఆఫీసర్ నారా రోహిత్ వస్తాడు.

అదే రోజు ఆ పబ్ లో మరో మూడు విచిత్ర మైన పాత్రలు కూడా వస్తాయి. సందీప్ కిషన్, ఒక భగ్న ప్రేమికుడు, తన ప్రియురాలు ఎక్కువ డబ్బు లేదని ఆమె చేతిలో అవమానింప బడి డబ్బు సంపాయించాలని కసి తో హైదరాబాద్ వస్తాడు. అతను ఆ రోజు అదే పబ్ కు వస్తాడు. ఇంకో భగ్న ప్రేమికుడు ఇంచు మించు ఇదే సమస్య తో ఉన్న ఆది అనే మరో ప్రేమికుడు అదే పబ్ కు వస్తాడు. వీళ్ళు కాక ఏజ్ బార్ అయిన మరో ప్రేమికుడు రాజేంద్ర ప్రసాద్, ఇతను కార్ లాక్ తెరవడంలో నిష్ణాతుడు. ఇతను తన విడో ప్రేమికురాలయిన ఇంద్రజ తో ఇదే పబ్ కు వస్తాడు.

వీళ్లందరిని అనుమానంతో స్టేషన్ కు తెచ్చి ఇంటార్రా గేట్ చేస్తాడు నారా రోహిత్. నిజానికి శమంతకమణి అనే ఆ కాస్ట్లీ కారును ఎవరు దొంగలించారు? ఆ రోజు తో వీళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మీరు తెరపైనే చూడాలి.

సుధీర్ ఒక డిప్రెస్సెడ్ క్యారక్టర్ లో ఎంతో హుందాగా నటించాడు. సందీప్ కిషన్ ఒక చదువు లేని మొరటు పాత్రలో మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆది కొంచెం ఎక్కువ యాక్టివ్ గా ఉండే టీనేజ్ లవర్ గా బాగానే ఉన్నాడు. నారా రోహిత్ ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగా ఇమిడి పోయి అదరగొట్టేసాడు. అందర్నీ మించి ఏజ్డ్ లవర్ గా రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటనతో అసాధారణంగా నటించాడు.

దర్శకుడు శ్రీరాం ఆదిత్య వినూత్నమైన కథతో, ఆద్యంతం ఆసక్తికరమైన కధనం తో ప్రతిభావంతమైన దర్శకత్వం చేశాడు. ఇది ఒక ప్రయోగాత్మక తెలుగు సినిమా అనడం లో ఎటువంటి సందేహం లేదు.

ఇది ఒక పూర్తి వినోదాత్మక ఆసక్తికరమైన సినిమా. మంచి కధ, నటీనటుల అద్భుత నటనతో తెలుగు సినిమాకు ఒక ట్రెండ్ సెట్టర్ అనొచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా వస్తే రొటీన్ గా వచ్చే ఓవర్ హీరోయిజం తో ఉండే ఓన్లీ హీరో ఓరియెంటెడ్ పనికిమాలిన సినిమాలకు స్వస్తి చెప్పొచ్చు.

- పర్వేజ్ చౌదరి