April 16, 2017

MP-siva-prasad-17-4-16

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా గళం విప్పి ఢీ అంటే ఢీ అంటున్న ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ కుటుంబం వైసీపీలో చేరనుందన్న ప్రచారం జోరందుకుంది. కొద్దికాలంగా వైసీపీకి ఆయన చేరువవుతున్నారని... వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని.. ఆయన భార్య ఎంపీగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

శివప్రసాద్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారైనప్పటికీ ఆయన భార్య రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. పైగా ఆమెకు వైద్యురాలిగా చిత్తూరు జిల్లాలో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో శివప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆయన పార్టీ మారుతారన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. టీడీపీలో కొనసాగే ఆలోచన ఏమాత్రం ఉన్నా కూడా ఇంతగా చంద్రబాబును ఎవరూ ధిక్కరించరని.. చంద్రబాబుకు ఆయన ఘాటుగా సమాధానాలు ఇవ్వడం చూస్తుంటే ఇక ఆయన పార్టీలో కొనసాగడం అసాధ్యమని తెలుస్తోంది.

తనను దెబ్బ కొట్టడానికి చంద్రబాబుకు వేరే కారణం ఏదీ దొరక్క హాథీరాం మఠం భూముల అంశం తెరపైకి తెచ్చి ఆరోపణలు చేస్తున్నారని శివప్రసాద్ అంటున్నారు. తాను కేవలం కుప్పం ఓట్లతో మాత్రమే గెలవలేదని.. చిత్తూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తల ఓట్లతో గెలిచానని అన్నారు. అలాగే తనకు కేవలం దళితులే ఓట్లు వేయలేదని, తన భార్య రెడ్డి కులానికి చెందినదని, ఆమె సామాజిక వర్గం కూడా తన గెలుపులో భాగమైందని ఆయన చెప్పారు. 2019 నాటికి కేవలం టీడీపీ మాత్రమే కాదని, పోటీ చేసేందుకు తనకు చాలా పార్టీలు ఉన్నాయని ఆయన ఓపెన్ గా చెప్పేశారు.

మరోవైపు కొద్దికాలం కిందట శివప్రసాద్ కుమార్తెపై దాడి జరిగినప్పుడు ఆమెకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆందోళన చేసిన సంగతి గమనార్హం. శివప్రసాద్ భార్య రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆమెకు సామాజిక వర్గ నేతలతో మంచి రిలేషన్సే ఉన్నాయని.. ఆమెకు ప్రజల్లో ఉన్న ఆదరణ రీత్యా వైసీపీలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇదే జరిగితే శివప్రసాద్ ఈసారి అసెంబ్లీకి, భార్య పార్లమెంటుకు వైసీపీ నుంచి పోటీ చేయొచ్చని తెలుస్తోంది.