November 13, 2017

kavita-revanth-reddy-17-11-13

తెలంగాణ సీఎం కేసీఆర్ 'ప్లాన్ ఆఫ్ యాక్షన్' రెడీ అయిందా ? కొన్నిరోజులుగా ప్రతిరోజూ కల్లోకొచ్చి వేధిస్తున్న ఆ ఇద్దరు 'రెడ్లకు' చెక్ పెట్టే ప్రయత్నం కొలిక్కి వచ్చినట్లేనా? అధికార పార్టీలో ఈ చర్చే ఇప్పుడు జోరుగా జరుగుతోంది. కేసీఆర్ కి కొరుకుడు పడని ఆ ఇద్దరు రెడ్లు..! రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి! పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. 'దమ్ముంటే కొడంగల్లో నన్ను ఓడించిచూడమంటూ' కేసీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. నల్గొండ నియోజకవర్గంలో 99 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వందమంది కేసీఆర్లు వచ్చినా, వెయ్యికోట్లు ఖర్చుపెట్టినా నన్ను ఓడగొట్టలేరంటూ తొడగొట్టేశారు. తెరాస పార్టీకి ఈ రెండు బహిరంగ హెచ్చరికలూ సహజంగానే మింగుడుపడవు. కోమటిరెడ్డి విషయం తేల్చుకోడానికి మళ్ళీ జనరల్ ఎన్నికల దాకా సమయముంది. ఇప్పటికే రాజీనామా చేసి.. రచ్చకు దిగేసిన రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ని మాత్రం నాన్చడానికి వీల్లేదు.

రేవంత్ రాజీనామా ఇప్పటికైతే చంద్రబాబు సొరుగులోనే వుంది. అది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చేతికంది, ఆమోదం పొందితేనే కొడంగల్ లో ఉపఎన్నిక. దానికి ఎంతకాలం పడుతుందన్న క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఒకవేళ బైపోల్ అనివార్యమైతే పాటించాల్సిన 'వ్యూహం' మీద అన్ని పార్టీలూ కసరత్తు మొదలుపెట్టేశాయి. ఈ విషయంలో అధికార తెరాస ఒక మెట్టు పైనే వుంది. కొడంగల్ నియోజకవర్గంలో 'స్పెషల్ ఆపరేషన్ ఆకర్ష్' స్కీం అమలు చేస్తూ, వచ్చినవారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకుంటోంది గులాబీ దళం. కానీ.. రేవంత్ లాంటి 'గట్టోడ్ని' ఎదుర్కోవాలంటే ఈ స్పీడ్ సరిపోదు గనుక నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారని, 'ఆపరేషన్ కొడంగల్' అనే బాధ్యతను ఎంపీ కవిత చేతుల్లో పెట్టబోతున్నారని సమాచారం.

నిజామాబాద్ ఎంపీగా పార్లమెంటుకే పరిమితమైన కవితమ్మను రాష్ట్ర పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన పార్టీలో ఎప్పట్నుంచో వుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీ చేయించనున్నారన్న మాట కూడా గట్టిగా వినిపించింది. ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక ఎన్నికల్లో తెరాస అనుబంధ 'సంఘం' గెలుపులో కీలక పాత్ర పోషించిన కవిత.. తన స్టామినా ఏమిటన్నది తండ్రి కేసీఆర్ దగ్గర ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు 'కొడంగల్' బాధ్యతల్ని కూడా కవితమ్మ భుజాల మీదే పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని, కొడంగల్ తెరాస అభ్యర్థిగా కవిత పేరును ఖరారు చేసినా ఆశ్చర్యం లేదని పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్లు చెప్పుకుంటున్నారు. కొడుకు కేటీఆర్ మంత్రిగా ప్రభుత్వ బాధ్యతల్లో బిజీగా ఉండడంతో.. కేసీఆర్ ఇలా 'ప్లాన్-బీ' సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. తెలంగాణ పాలిటిక్స్ లో 'రేవంత్ ఫ్యాక్టర్' ని ఎంత వీలయితే అంత తగ్గించాలన్నదే కేసీఆర్ ఆలోచన. .