October 07, 2017

hindi-medium-venkatesh

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. రెండు ఇండ‌స్ట్రీల‌లో హిట్ సినిమాల‌కు రీమేక్ చేయ‌డానికి ద‌ర్శ‌కనిర్మాత‌లు ఆస‌క్తి చూపుతున్నారు. విల‌క్ష‌ణ‌మైన ప‌ర‌భాషా క‌థ‌ల‌ను రీమేక్ చేయడానికి విక్ట‌రీ వెంక‌టేష్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ మ‌ధ్య వెంకీ త‌న వ‌య‌సుకు త‌గిన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ దృశ్యం రీమేక్ తో వెంకీ మంచి హిట్ అందుకున్నాడు. వెంకీ న‌టించిన గోపాల గోపాల, గురు చిత్రాలు బాలీవుడ్ హిట్ మూవీస్ ఓ మై గాడ్‌, సాలా ఖడూస్ ల రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, మ‌రో బాలీవుడ్ రీమేక్ లో వెంక‌టేష్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో న‌టించిన హిందీ మీడియం ను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌.

ఈ ఏడాది మేలో విడుద‌లైన హిందీ మీడియం మూవీ కమర్షియల్ గా మంచి స‌క్సెస్ సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకురాలు నందిని రెడ్డి ప్లాన్ చేస్తోంద‌ట‌. హీరో వెంక‌టేష్ కు ఈ సినిమా స‌రిగ్గా స‌రిపోతుంద‌ని, తెలుగు నేటివిటీకి కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని నందిని భావిస్తోంద‌ట‌. ఈ సినిమాకు తెలుగు మీడియం అని టైటిల్ కూడా ఖ‌రారైంద‌ట‌. వెంకటేష్ కూడా మంచి క‌థ ఉన్న చిత్రాల‌ను రీమేక్ చేయ‌డానికి ఆసక్తి చూపిస్తున్నందున ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని స‌మాచారం. నందిని ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తోంద‌ని, ఆ త‌ర్వాత వెంకీ స్క్రిప్ట్ ఫైన‌ల్ చేయ‌డ‌మే ఆలస్య‌మ‌ని స‌ద‌రు నిర్మాత త‌న మిత్రుల‌తో అన్న‌ట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే మ‌రో బాలీవుడ్ రీమేక్ లో వెంకీ న‌టించ‌డం ఖాయ‌మే. అయితే, ఈ సినిమా గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.