August 08, 2017

Virat-Imran-Manjrekar

గత కొంతకాలంగా టీమిండియా అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టెస్టుల్లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అటు స్వదేశంలో వరుస సిరీస్ లను గెలవడంతో పాటు విదేశీ పర్యటనల్లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక జట్లపై సైతం సిరీస్ లను సొంతం చేసుకుంది. అయితే మన మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ కు విరాట్ సేన సాధిస్తున్న విజయాలు అంతగా రుచిస్తున్నట్లు లేదు. టీమిండియా ఏమాత్రం కష్టపడకుండానే విజయాల్ని సాధిస్తుందనే అపోహలో ఉన్నట్లు ఉన్నాడు. బలహీన జట్లపై భారత్ ఆడుతుందన్న భావనలో సంజయ్ మంజ్రేకర్ ఉన్నట్లు కనబడుతోంది.

ఆ మేరకు విరాట్ అండ్ గ్యాంగ్ కు ఒక సలహాకు ఇచ్చేశాడు. బలమైన జట్లతో సిరీస్ లు ఉండేటట్లు చూసుకోమంటూ సలహా ఇచ్చేశాడు. అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను అనుసరించాలని విరాట్ కు సూచించాడు. గతంలో ఇమ్రాన్ తన సారథ్యంలో పాక్ ఆడే మ్యాచ్ లను బలమైన ప్రత్యర్థులతో ఉండేటట్లు చూడాలని బోర్డును కోరేవాడన్నాడు. మ్యాచ్ ల విషయంలో ఇమ్రాన్ ను విరాట్ ఫాలో అవ్వాలంటూ మంజ్రేకర్ ఉచిత సలహా ఇచ్చాడు. ఇటీవల కాలంలో తనకు అనవసరమైన విషయాల్లో మంజ్రేకర్ తలదూర్చుతూ అక్షింతలు వేయించుకుంటున్నాడు. ఐపీఎల్ సందర్భంగా పొలార్డ్ ను, ఇటీవల ముగిసిన మహిళల వరల్డ్ కప్ సందర్బంగా భారత క్రికెటర్లపై విమర్శలు చేసి నవ్వులు పాలయ్యాడు. మరి మంజ్రేకర్ తాజా వ్యాఖ్యలపై స్పందన ఎలా ఉంటుందో చూద్దాం.