December 03, 2017

Vishal-Rjinikanth-Kamal

ఆర్‌కేనగర్‌ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు హీరో విశాల్‌ స్పష్టం చేశారు. మాజీ సీఎం జయలలిత మరణించడంతో ఖాళీ అయిన ఆర్‌కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 21న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. డీఎంకే అభ్యర్థిగా మరుదుగణేశ్‌, అన్నాడీఎంకే అభ్యర్థిగా ఇ.మధుసూదన్‌, స్వతంత్ర అభ్యర్థిగా అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌ బరిలో ఉన్నారు. సంక్షోభంలో ఉన్న తమిళనాడు రాజకీయాలు ఆర్కేనగర్‌ ఉపఎన్నిక ఫలితంలో కీలక మలుపు తీసుకుంటాయని అంతా భావిస్తున్న తరుణంలో హీరో విశాల్‌ కూడా పోటీకి దిగుతుండటం మరింత ఉత్కంఠ రేపుతోంది. తెలుగు ఓటర్లు అధికంగా వున్న ఈ నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేయాలని విశాల్‌ నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. తాను ఎందుకోసం పోటీచేస్తున్నది నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత వెల్లడిస్తానన్నారు.

విశాల్‌ ఎన్నికల బరిలోకి దిగితే దినకరన్‌ తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడప్పాడి బృం దాన్ని పార్టీ ద్రోహులంటూ పలుమార్లు తూర్పారబట్టిన దినకరన్‌, ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఈపీఎస్‌, ఓపీఎస్‌ బృందానికి విజయం దక్కకూడదనే కసితో ఉన్నా రు. అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలో ఉన్న మధుసూదన్‌ను ఓడించేందుకు దినకరన్‌ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో విశాల్‌ను బరిలోకి దింపితే ఓట్లు చీలడం ఖాయం. తద్వారా మధుసూదన్‌ ఓట్లకు గండిపడుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. విశాల్‌ నామినేషన్‌ వేశాక తాను బరిలో నుంచి తప్పుకోవాలని దినకరన్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూస్తున్న తరుణంలో కోలీవుడ్‌ ‘పందెంకోడి’ విశాల్‌ అనూహ్యంగా తెరపైకి వచ్చి బరిలోకి దూకేశారు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, తర్వాత ముందుకు దూకెయ్యడం ఆది నుంచి విశాల్‌ మనస్తత్వం. నడిగర్‌ సంఘం ప్రధానకార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సినిమా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, కొన్నేళ్లుగా అభిమాన సంఘాల ద్వారా, తన తల్లి పేరు మీద ఏర్పాటుచేసిన ట్రస్టు తరపున పేదలకు, ఆపన్నులకు సాయం చేస్తున్నారు. అటు నడిగర్‌ సంఘం, ఇటు నిర్మాతల మండలిలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సీనియర్లు, ఉద్దండ సినీ ప్రముఖుల్ని ఎదిరించి ఎన్నికల్లో విజయాలు సాధించారు. ఆ స్ఫూర్తితో అదే మార్పు నినాదంతో ఆర్‌కేనగర్‌లో బరిలోకి దిగేందుకు విశాల్‌ నిర్ణయించుకున్నారు. 2 రోజులపాటు శ్రేయోలాభిలాషులు, రాజకీయ సన్నిహితులతో చర్చిం చాకే ఈ ప్రకటన చే సినట్లు తెలుస్తోంది.

విశాల్‌ నిర్ణయాన్ని యువత స్వాగతిస్తే, తమిళవాదులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఇదేనని, ఆర్‌కేనగర్‌ ఉపఎన్నికలో విశాల్‌ పోటీచేయడాన్ని స్వాగతిస్తున్నానని దర్శకుడు సుందర్‌.సి పేర్కొంటే, ట్విట్టర్‌లో ప్రకటనలు చేస్తున్నవారికంటే ధైర్యంగా బరిలోకి దిగిన విశాల్‌ గట్స్‌కి శభాష్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రశంసలు కురిపించారు. అయితే, ఆర్‌కేనగర్‌లో తమిళులే పోటీ చేయాలని తమిళవాదులుగా పేరుతెచ్చుకున్న దర్శకులు సీమాన్‌, అమీర్‌ వ్యాఖ్యానించారు.