April 16, 2017

yogi-adityanath-17-3-29

ఉత్తరప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రంలోని పేద ముస్లిం యువతులకు సామూహిక వివాహాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మైనార్టీ కమ్యూనిటీకి చెందిన పేద యువతులకు సామూహిక వివాహాల పథకానికి సీఎం ఆదిత్యనాథ్‌ ఆమోదం తెలిపారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'వంద రోజుల' కార్యక్రమంలో చేరుస్తామని మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి మోహిసిన్‌ రజా తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఆ రాష్ట్రంలో ముస్లింలు 20 శాతం ఉన్నారు. ఈ పథకంలో సింహ భాగం మైనార్టీ కమ్యూనిటీలకే చెందుతుందన్నారు. మైనార్టీ కమ్యూనిటీలో చాలా మంది పేదలున్నారన్న సంగతి తనకు తెలుసునని రజా తెలిపారు. వారందరూ లబ్ది పొందాలన్నదే తమ ప్రభుత్వం ఆలోచనని అన్నారు. వారి కోసం కూడా ఒక పథకాన్ని రూపొందిస్తున్నామన్నారు. ప్రతి బాలికకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా సామూహిక వివాహాలకయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. సిక్కులు, క్రైస్తవులతో సహా మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన యువతులకు సామూహిక వివాహాలు నిర్వహించాలన్న ఆలోచన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌దేనని ఆయన చెప్పారు.