December 03, 2017

amrutha-geetha-jayalalithaa

తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితను శశికళ గణమే హతమార్చిందని ఆరోపించి కలకలం రేపిన ఆమె చిన్ననాటి స్నేహితురాలు గీత.. తాజాగా అమృత జయ కూతురేనని మరో సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం సేలంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

నటుడు శోభన్‌బాబు, జయలలితకు పుట్టిన ఆడబిడ్డ అమృతేనని, ఈ విషయం శశికళకూ తెలుసని వివరించారు. తనకు కుమార్తె ఉందంటే ప్రజల్లో పరువు పోతుందన్న భయంతోనే జయ బెంగళూరులో నివసిస్తున్న తన సోదరి శైలజకు అమృతను అప్పగించి పెంచాలని సూచించారని, ఆ ప్రకారమే ఆమె సారథి, శైలజ దంపతుల కుమార్తెగా పెరిగిందన్నారు.

1996 నుంచి జయను అమృత సంప్రదించేదని, డబ్బు, ఆస్తులను ఎన్నడూ ఆశించలేదన్నారు. జయ కుమార్తెగా ఉంటే చాలని తృప్తి చెందేదని, ఆమెకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. 1999లో తాను శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు తనకు అమృత అనే కుమార్తె ఉందని ఆయన కూడా చెప్పారన్నారు. అమృత జయ కూతురేనన్న విషయం ఓపీఎస్‌కు తెలుసునని, ఆయనా అమృతను పట్టించుకోలేదని గీత పేర్కొన్నారు.