June 15, 2017

durg-muncipality-radh

బాహుబలి, బాహుబలి-2 సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే, దానిలోని ఒక ఐడియా రోడ్లను పరిశుభ్రపరచడానికి ఫిట్ అయ్యింది. ఆ సినిమాలో భళ్లాలదేవ రథం రూపకల్పన అదిరిపోయింది. రథం ముందుకు కదులుతుంటే దానికున్న చురకత్తులు.. ప్రత్యర్థుల కుత్తుకలను తెగ్గోస్తుంటాయి. అయితే ఇలాంటి రథమే చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని ఒక్క ఉదుటున ఊడ్చి పారేస్తోంది. ఇక్కడ తేడా ఒక్కటే.. భళ్లాలదేవ రథానికి కత్తులుంటే... దుర్గ్‌లోని చెత్త రథానికి చీపుర్లుంటాయి.

దుర్గ్ మున్సిపాలిటీ... పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను తగ్గించాలనుకుంది. ఈ నేపధ్యంలో బాహుబలి ఐడియాతో ఈ చెత్త రథాన్ని రూపొందించింది. ఫలితంగా తక్కువమంది సిబ్బందితోనే దుర్గ్‌రోడ్లు తళతళలాడిపోతున్నాయి. ఈ వాహనానికి మున్సిపాలిటీ... దుర్గ్‌ రోడ్ క్లీనర్ అని పేరుపెట్టింది. ఇటువంటి 30 వాహనాల సాయంతో పట్టణంలోని అన్ని రోడ్లను గంట వ్యవధిలో పరిశుభ్రం చేయవచ్చని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. బాహుబలి -2 సినిమా చూసిన మున్సిపల్ అధికారి రాజ్‌కుమార్‌కు ఇటువంటి వాహనాన్ని రూపొందించాలనే ఆలోచన వచ్చింది. ఇందుకోసం సిబ్బందితో సమావేశమై చర్చించారు. తరువాత నిపుణుల సాయంతో చెత్తవాహనాన్ని రూపొందించారు. ప్రస్తుతం దీనిని వినియోగస్తున్నప్పటికీ, మరింత అభివృద్ధి చేయాలని మున్పిపల్ అధికారులు భావిస్తున్నారు.