July 12, 2017

earth-destroyed

భూమి చరిత్రలో ఆరో వినాశనం దగ్గర్లోనే ఉందా!? ఇప్పటి వరకూ ఊహించిన దాని కంటే ఇది తీవ్రంగా ఉండనుందా!? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు శాస్త్రవేత్తలు. జనాభా, వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడం వన్యప్రాణులు భారీగా కనుమరుగు కావడానికి కారణమని వారు వివరించారు. ఇప్పటికే వందలాది కోట్ల ప్రాంతీయ, స్థానిక జీవజాతులు అంతమయ్యాయని తెలిపారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

భూమిపై వందలాది కోట్ల క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయ చరాలు కనుమరుగు అయ్యాయని, ఈ కారణంగానే ఇప్పటికే ఊహించిన దానికంటే వేగంగా ఆరో సమూహ వినాశనం సమీపంలోకి వచ్చేస్తోందనే నిర్ధారణకు వచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. జీవ వైవిధ్యం దెబ్బతిని భూమి సమతుల్యత దెబ్బతిని ప్రాణి జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని వివరించారు. గత శతాబ్దంలో భూమిపై ఉన్న సగం క్షీరదాలు కనుమరుగయ్యాయని, జీవ విధ్వంసం కారణంగా పర్యావరణ, ఆర్థిక, సామాజిక పర్యవసానాలు కచ్చితంగా ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మానవ జాతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కాగా, తొలి సమూహ వినాశనం ఆరు కోట్ల 60 లక్షల ఏళ్ల కిందట సంభవించింది. దానివల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఆ తర్వాత వివిధ దశల్లో నాలుగుసార్లు వేగంగా జీవజాలం అంతరించింది. ఆరో సమూహ వినాశనంలో గతంలో కంటే వంద రెట్లు వేగంగా వణ్యప్రాణులు కనుమరుగవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.