July 12, 2017

prabhas-17-7-12

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంతో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. భారత్‌లో అత్యంత ప్రభావితమైన పిన్న వయస్కుల జాబితాలో ప్రభాస్ ఆరోస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’తో జాతీయస్థాయి నటుడిగా మారిన ప్రభాస్.. ఆ సినిమా మొదటి భాగం విడుదలై రెండేళ్లయిన సందర్భంగా సోషల్‌మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ఒకటి చేశాడు. ప్రభాస్ చేసిన ఆ పోస్ట్‌పై అభిమానులు కూడా అంతే ఉద్వేగంతో ప్రతిస్పందిస్తున్నారు.

భారత సినీ పరిశ్రమలో తనను ఉన్నత స్థానంలో నిలిబెట్టిన రాజమౌళికి, సినీ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు ప్రభాస్. ‘‘నాకెంతో ప్రత్యేకమైన సినిమా ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలై రెండేళ్లు పూర్తయింది. కానీ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. చిత్ర యూనిట్ మొత్తం ఒక తపనతో పడిన కష్టం నా జ్ఞాపకాల తెరముందు స్పష్టంగా కనిపిస్తోంది. నా కెరీర్‌ను మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావిస్తున్నాను. ‘బాహుబలి’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనందరినీ వెనకుండి నడిపించిన రాజమౌళికి మనం రుణపడి ఉంటాం.’’ అని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.