August 08, 2017

priyanka-indira-gandhi-17-8-8

సోనియాగాంధీ కూతురు ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా? ఆమె అయితేనే కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా పునరుజ్జీవనం సాధ్యమని కొన్నేళ్ళుగా చెబుతున్నాయి ఏఐసీసీ వర్గాలు. ఈ విషయంలో ఎట్టకేలకు ఆమె ప్రత్యక్ష రాజకీయా ల్లోకి వచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 2019 ఎన్నికలను వేదికగా చేసుకుని కర్ణాటకలోని ఓ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోవున్న పెద్ద రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. అందుకే ఇక్కడ నుంచే ప్రియాంకను బరిలోకి దించాలని అధిష్ఠానం ఆలోచన. ఇందుకు కారణాలు చాలానే వున్నాయి.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం రెండోసారి రాజకీయాలలో రాణించేందుకు కర్ణాటకను ఎంచుకున్నారు. ఉడిపి- చిక్క మంగుళూరు నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. అదే నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ వీలుకాని పక్షంలో మైసూరు నుంచి బరిలోకి దింపాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సౌత్‌లో పాగా వేసేందుకు మోదీ, అమిత్ షాలు అధికారిక నివాసం ఏర్పాటు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరగ్గా, ఈ నేపథ్యంలో ప్రియాంకను ఈసారి కర్ణాటక నుంచి బరిలోకి దిగడం ఖాయమనే వార్త రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.