April 16, 2017

Rachamallu-Prasad-Reddy

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నడిరోడ్డుపై నిల్చుని తనకు తానుగా చెప్పుతో కొట్టుకున్నారు. ప్రొద్దుటూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వరుసగా రెండోసారి వాయిదా పడటంతో తీవ్ర అసహనానికి లోనైన ఆయన నిరసనగా నడిరోడ్డుపై ఈ పనిచేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అరాచక ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేగా కొనసాగలేను.. తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికలో తమ మద్దతుదారుడైన ముక్తియార్‌‌కు 27మంది మద్దతు ఉంది.. ఖచ్చితంగా గెలుస్తారు.. అలాంటిది నియోజకవర్గ ఇంచార్జ్ వరదరాజులరెడ్డి అనవసర రాద్ధాంతాలు చేసి వాయిదా పడేలా చేయడం బాధాకరమని తన ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు, ప్రభుత్వాధికారులు టీడీపీకి తొత్తుగా పనిచేస్తున్నాయి.. మీ యొక్క దాష్టికానికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులు తొత్తులు కావడం సిగ్గుచేటన్నారు. ఉపఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో ఇందుకు నిరసనగా ఆయన తనకు తానుగా చెప్పుతో కొట్టుకున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయడానికి మరోసారి టీడీపీ డ్రామా ఆడటం, అధికారులు అందుకు వత్తాసు పలుకడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యానికి అధికారులు లొంగిపోవడాన్ని తప్పుబట్టారు.