August 08, 2017

rana-nithin-bellamkonda

సాధారణంగా తమ సినిమాల విషయంలో హీరోలే పోటీ పడడం సహజం. కానీ టాలీవుడ్‌లో ఈ సారి పోటీ పడడం తండ్రుల వంతయింది. అదేంటో చూద్దాం.. ఈ నెల 11 న ఒకేరోజు ముగ్గురు హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. దగ్గుబాటి రానా చిత్రం నేనే రాజు-నేనే మంత్రి, నితిన్ సినిమా " లై ", బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ జయ జానకి నాయక విడుదలవుతూ ఎన్నడూ లేని వింత పోటీ సృష్టించాయి. ఇవి రిలీజ్ కాకముందే ఈ హీరోల తండ్రులు, నిర్మాతలు కూడా అయిన డి. సురేష్ బాబు, బెల్లంకొండ సురేష్, ఎన్. సుధాకర రెడ్డి, తమ తనయుల చిత్రాల విడుదలపై ఒకరితో ఒకరు పోటీ పడుతున్న విచిత్ర వాతావరణం ఏర్పడింది.

ఇలా ఒకే రోజున మూడు సినిమాలు విడుదల కావడం పరిశ్రమకు మంచిది కాదని, దీనివల్ల ఒక మూవీ కలెక్షన్ల ప్రభావం మరో మూవీ వసూళ్ళ పై పడవచ్చునని సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. దీనివల్ల మనకు చెడే తప్ప మంచి జరగదు అని ఆయన మిగిలిన ప్రొడ్యూసర్లు..బెల్లంకొండ సురేష్, సుధాకర రెడ్డిలకు మెసేజ్ పంపారు. రానా సినిమా .. నేనే రాజు-నేనే మంత్రి తమిళంలో కూడా విడుదలవుతోందని, తమిళనాడులో అజిత్ సినిమా కూడా రిలీజ్ అవుతున్నందున ఆ సినిమాతో పోటీ పడదల్చుకోలేదని అందువల్ల నేనే రాజు..తప్పనిసరిగా ఈ నెల 11 న విడుదల కావలసిందే నని సురేష్ బాబు పట్టుబడుతున్నారు. ఈ మూవీని ఆయనతో కలిసి భరత్, కిరణ్ కూడా సంయుక్తంగా నిర్మించినప్పటికీ.. సురేష్ బాబే తీవ్రంగా కలవరపడుతున్నారు.

ఇక తమ చిత్రాన్ని ఆగస్టు 11 న విడుదల చేస్తామని తాము చాలాకాలం క్రితమే ప్రకటించామని " లై " చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర అంటున్నారు. తాము గతంలోనే థియేటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని, తమ సినిమా విడుదలకు ఇదే తగిన సమయమని ఆయన చెబుతున్నారు. ఇలాగే బెల్లంకొండ సురేష్ కూడా తన తనయుడు శ్రీనివాస్ మూవీ జయ జానకి నాయక 11 న విడుదల కావలసిందే అని అంటున్నారు. ఇలా తమలో తాము తగవులాడుకుంటున్న ఈ ముగ్గురికీ నచ్చజెప్పడానికి దిల్ రాజు, ఎన్వీ ఆర్ ప్రసాద్ వంటి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఈ ముగ్గురు నిర్మాతల మధ్య చర్చలు విఫల మయ్యాయి. ఒక దశలో లాటరీ కూడా వేయాలనుకున్నారట. ప్రస్తుతం ఈ వివాదం తెలుగు నిర్మాతల మండలి వద్దకు చేరింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మండలి కృషి చేస్తోంది.