naradasu-laxman-16

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఓ ఇంటివారు కాబోతున్నారు. వచ్చే నెలలో ఆయన 41 ఏళ్ల వయసున్న వర్ష అనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం నారదాసు వయసు 61 సంవత్సరాలు. కరీంనగర్ జిల్లా వాసి. విప్లవోద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావు సన్నిహితుడిగా నారదాసుకు పేరుంది. అనంతరం ఉద్యమం నుంచి బయటకు వచ్చి కొంతకాలం పాటు న్యాయవాదిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు.

ఉద్యమం మొదటి నుంచి తన వెన్నంటే ఉన్న నారదాసు లక్ష్మణరావుకు మొదట పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిపించి గౌరవించారు కేసీఆర్. అనంతరం తాజాగా స్థానిక సంస్థల కోటాలో మరోసారి అవకాశమిచ్చారు. ఎప్పుడూ ఆయన పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇంట్లో వదిన ఆయన్ను తల్లిలా చూసుకుంది. అయితే అనారోగ్యంతో ఆమె గతేడాది కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఓ తోడు ఉంటే బాగుంటుందని భావించిన నారదాసు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో ఆయనకు హైదరాబాద్ కు చెందిన 41 ఏళ్ల వర్ష పరిచయమైంది. ఆవిడ కూడా నారదాసును ఇష్టపడడంతో ఇద్దరూ ఒక్కటవ్వబోతున్నారు.

వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా అక్టోబర్ లో రిజిస్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అన్ని అనుమతులు రావడంతో వచ్చే నెలలో వీరిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకోబోతున్నారు. తన పెళ్లి విషయాన్ని నారదాసు ఇప్పటివరకూ ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. కరీంనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో నారదాసు పెళ్లికి అనుమతి ఇస్తూ ఓ ప్రకటన అతికించారు. దీన్ని గమనించిన కొంతమంది లాయర్లు.. ఆయన పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.

మరి ఆయన పెళ్లి ఎలా చేసుకుంటారనేదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రిజిస్టర్ కార్యాలయంలో గుంభనంగా చేసుకుంటారా.. లేకు అధినేత కేసీఆర్ సమక్షంలో ఒక్కటవుతారా.. అనేది ఇప్పుడు సస్పెన్స్.